నెలసరి, స్త్రీలలో హార్మోన్ల పాత్ర ఎటువంటిది ? - Strilu Hormones - Women and Hormones

0


నెలసరి, స్త్రీలలో హార్మోన్ల పాత్ర ఎటువంటిది ? - Strilu Hormones - Women and Hormones

ప్రశ్న: నా వయసు ముప్ఫై. నెలసరి రెణ్నెల్లకోసారి వస్తోంది. వైద్యుల్ని సంప్రదిస్తే.. హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓఎస్‌ అంటూ మందులు సూచించారు. ఏమిటీ పరిస్థితి? అసలు హార్మోన్ల అసమతుల్యత వల్ల ఏయే సమస్యలు తలెత్తుతాయి?హార్మోన్ల పనితీరు అంత కీలకమా?.
- ఓ సోదరి

జవాబు: స్త్రీ శరీరంలో మెరుగైన పునరుత్పత్తి వ్యవస్థకు హార్మోన్ల పాత్ర కీలకమైంది. వాటి సమతుల్యత ఏ మాత్రం లోపించినా సమస్యలు తప్పవు. పునరుత్పత్తి వ్యవస్థకు సందేశాలు అందించడంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌, తక్కువ మోతాదులో ఉండే టెస్టోస్టెరాన్‌ (పురుష హార్మోను) కాకుండా లుటైనిజింగ్‌ (ఎల్‌హెచ్‌), ఫాలికల్‌ స్టిమ్యులేటింగ్‌ (ఎఫ్‌ఎస్‌హెచ్‌), గోనాడోట్రోఫిన్‌ రిలీజింగ్‌ (జీఎన్‌ఆర్‌హెచ్‌) అనే ఆరు హార్మోన్లు ముఖ్యమైనవి. అవి సక్రమంగా సాగినంత కాలం సమస్యలు రావు. రుతుక్రమం సజావుగా సాగుతుంది. సమతుల్యత లోపించినప్పుడే సమస్యలు మొదలవుతాయి. మీ విషయంలో ఇదే జరిగింది. నెలసరి సక్రమంగా రాకపోవడానికీ హార్మోన్ల పని తీరే కారణం.

నెలసరి ఆలస్యం..
అండాశయాల్లోని హార్మోన్లలో మార్పు చోటు చేసుకొని, ఫలితంగా పురుష హార్మోనుగా పరిగణించే టెస్టోస్టెరోన్‌ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి కావడం వల్ల నెలసరి సక్రమంగా రాదు. పీసీఓఎస్‌ (పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌)గా పేర్కొనే ఈ పరిస్థితి వల్ల ప్రతినెలా అండం సక్రమంగా విడుదల కాదు. కొందరిలో అండాలే విడుదల కావు. అందుకే నెలసరి రావడంలో ఆలస్యం. ఒకవేళ వచ్చినా రక్తస్రావం సక్రమంగా కాకపోవడం వంటి సమస్యలుంటాయి. ఇదే కొనసాగితే, సంతానసాఫల్య సమస్యలు, అవాంఛిత రోమాలు, మొటిమలూ బాధిస్తాయి. ఈ సమస్యతో బాధపడే ప్రతి పదిమందిలో నలుగురు అధిక బరువు పెరుగుతారని ఓ అధ్యయనం తెలిపింది. సమస్యను నివారించకపోతే మధుమేహం, అధిక రక్తపోటు వంటివీ తప్పవు. అలాగే నెలసరి సక్రమంగా రాకపోయినా, ఆగిపోయినా గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వైద్యులు సూచించిన మందులు వాడుతూ, జీవనవిధానంలో మార్పులు చేసుకుంటే ఈ సమస్యను చాలామటుకు అదుపులో ఉంచవచ్చు.

Women and Hormones

శారీరక, మానసిక సమస్యలు..
హార్మోన్లలో చోటు చేసుకునే తేడా వల్ల ఎదురయ్యే మరో సమస్య ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పీఎమ్మెస్‌). దాదాపు తొంభై శాతం మహిళలకు ఎదురయ్యే సమస్యే ఇది. నెలసరికి రెండు వారాల ముందు నుంచి చిరాకు, ఒత్తిడి, ఆందోళన, ఉద్వేగాలకు లోనవడం, అలసట, తలనొప్పి, ఆకలి లేకపోవడం, రొమ్ముల్లో నొప్పి.. వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవి అందరిలో ఒకేలా ఉండవు. నెలసరి వచ్చి ఆగిపోయాక లక్షణాలు అదుపులోకి వస్తాయి. హార్మోన్ల ప్రభావం జుత్తు, చర్మంపైనా ఉంటుంది. నెలసరి సమయంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్ల పనితీరులో తేడా వల్లే ఈ పరిస్థితి. అధిక బరువున్న వారు, వ్యాయామం సరిగా చేయనివారు, బీఎంఐ ఎక్కువగా ఉన్నవారిలో ఇది మరింత అధికం. జీవన శైలిలో మార్పులు చేసుకుంటే.. సమస్య అదుపులోకి వస్తుంది.

మెనోపాజ్‌ ఇబ్బందులు..
హార్మోన్ల తేడా వల్ల చోటుచేసుకునే మరో మార్పు మెనోపాజ్‌. ఈ దశలో నెలసరి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అండాశయాలు ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరాన్‌ హార్మోన్లను చాలా తక్కువగా ఉత్పత్తి చేయడమే అందుక్కారణం. తరచూ హార్మోన్ల స్థాయులు మారుతుండటం వల్ల నెలసరి ఓ పద్ధతి ప్రకారం రాదు. ఈ మార్పు నలభైల్లో మొదలై నెమ్మదిగా కొనసాగి, చివరకు రుతుచక్రం ఆగిపోతుంది. ఈ సమయంలో హాట్‌ఫ్లషెస్‌, దాంతో అధిక స్వేదం... రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, జననేంద్రియాల దగ్గర పొర పొడిబారి పలచగా మారడం, కలయిక అసౌకర్యం, మానసిక స్థితిలో తేడాలు, అధికబరువు వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటిని అదుపులో ఉంచేందుకు వైద్యులు హార్మోన్లను సిఫారసు చేస్తారు. అవి ఈస్ట్రోజెన్‌కు ప్రత్యామ్నాయం. అలా వాడే అన్నిరకాల మందుల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోను తప్పనిసరిగా ఉంటుంది. ఇవి చాలారకాల్లో లభిస్తాయి. వాటి వల్ల కొంత మార్పు ఉన్నా.. గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే ఆస్కారం ఎక్కువ. అందుకే వైద్యులు ఈస్ట్రోజెన్‌తోపాటు ప్రొజెస్టెరాన్‌ను కూడా కలిపి సిఫారసు చేస్తారు. హిస్ట్రెరెక్టమీ చేయించుకుంటే.. ఇతర ప్రత్యామ్నాయాల్ని సూచిస్తారు.

హార్మోన్లలో తేడా చోటుచేసుకోకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలికి, సమతులాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పంచదార, కెఫీన్‌, కొవ్వు ఆధారిత పదార్థాల్ని తగ్గించాలి. పండ్లు, కూరగాయల మోతాదును పెంచాలి. వ్యాయామం చేయడం, బరువుని అదుపులో ఉంచుకోవడం అన్నివిధాలా మేలు.  -డాక్టర్‌ ప్రణతీరెడ్డి, యూరో గైనకాలజిస్టు

హెచ్చరిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top