స్త్రీ - శక్తి స్వరూపిణి - Stri Shakti

0

లక్ష్మివి నువ్వే.. సరస్వతివి నువ్వే.. పార్వతివి నువ్వే. మూడు శక్తులు నువ్వే.  బ్రహ్మా-విష్ణు-మహేశ్వరరూపం కూడా నువ్వే. ఓ దుర్గా నీకు నమస్సులని మొక్కుతారామెను. అంతటి మహిమాన్విత. దసరా శరన్నవరాత్రి రోజుల్లో దుర్గమ్మ ఒక్కో రోజు ఒక్కో అవతారమహిమ చూపుతుంది. స్త్రీ శక్తి నిదర్శనంగా నిలిచే ఆ తల్లి మహిమలు ఎలాంటివి?

ఒక్కో చోట ఒక్కో పేరు. ఒక్కో రూపం ఒక్కో శక్తి.. అందుకే ఆమెను అమ్మలగన్నయమ్మగా చెబుతారు. ముగరమ్మల మూలపుటమ్మగా కొలుస్తారు. ఈ సృష్టికి ఆధారం ఆ తల్లేనని భావిస్తారామె భక్తులు. ఈ శరన్నవరాత్రుల్లో దుర్గమ్మలో కనిపించే వివిధ రూపాలను చూపి పులకరించి పోతుంటారు భక్తులు. చిన్ని చిన్ని ఆడపిల్లల నుంచి అమ్మమ్మల వరకూ ప్రతి స్త్రీ మూర్తినీ గౌరవించి ఆదరించమని సూచిస్తాయా తల్లి అవతార మహిమలు. ఆమె నీ రక్షణలో కాదు.. నువ్వే ఆమె రక్షణలో బతుకుతున్నావని చెబుతాయా లీలలు.

దసరా వచ్చిందంటే కనకదుర్గమ్మ కోటి సూర్యకాంతులతో దర్శనమిస్తుంది. వివిధ అవతారాల్లో కరుణిస్తుంది. అర్ధం చేసుకోవాలేగానీ.. అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కో స్త్రీ సూక్తి విడమరచి చెబుతుంది.

తొలి రోజు కనకదుర్గమ్మ శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. బాలత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటే అజ్ఞానం తొలగిపోతుందన్నది భక్తుల విశ్వాసం. బాలా అన్న శబ్ధానికి.. అన్నెం, పున్నెం ఎరుగని బాలికని అర్థం. చిన్న పిల్లల మనస్సు నిర్మలంగా ఉంటుంది. అటు వంటి హృదయాలలో పరమాత్మికత నివసిస్తుంది. కాబట్టి, మనం చిన్న పిల్లలలాగా నిర్మలంగా అమ్మవారిని ఆరాధించాలన్న అంతరార్ధం దాగి వుంటుందట ఈ అవతారంలో. అలాగే బాలా అంటే జ్ఞానమని కూడా అంటారు. బాలా స్వరూపమైన అమ్మవారిని ఎవరు అర్చిస్తారో వారికి జ్ఞానానందం కలుగుతుంది. కామక్రోధాలను జయించి ఆత్మానందాన్ని పొందుతారని తెలుస్తోంది. అందుకే నవరాత్రుల్లో ప్రధమ దినాన అమ్మవారిని బాలాత్రిపురసుందరీదేవిగా ఆరాధన చేసి అజ్ఞానాన్ని పారద్రోలడానికి ప్రయత్నించాలని చెబుతారు పండితులు. అంతే కాదు.. పిల్లల్లో తానుంటానని. వారి ఆయురారోగ్యాలను కాపాడే బాధ్యత ఎవరైతే చక్కగా తీసుకుంటారో.. వారే తనకు అత్యంత ఇష్టులని దుర్గమ్మ బాలాత్రిపురసుందరిగా కొలువుదీరి భక్తులకు సెలవిస్తుంది.

రెండవ రోజున కనకదుర్గమ్మ గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది.  దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ... ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో కనిపిస్తుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి భక్తులను కరుణిస్తుంది.  గాయత్రికి మించిన మంత్రము, అమ్మకు మించిన దైవమూ లేదని అంటారు. అను నిత్యం గాయిత్రి జపించే వారిని ఆమె సదా రక్షిస్తుందని నమ్ముతారు. అంతేకాదు ప్రతి స్త్రీ ఒక శక్తి స్వరూపిణి. ఆమెలో ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలున్నాయి. ఇవి ఆమెలోని విశేషశక్తులకు ప్రతిరూపం. ఆమెలోని అపారమైన విద్యలకు సాక్ష్యాలు. కనుక స్త్రీలను గౌరవించడం వల్లే ఈ ప్రపంచం కాపాడబడుతుందని  గాయిత్రీ అవతారమహిమను భావించవచ్చు.

అమ్మవారు మూడో రోజు అన్నపూర్ణాదేవిగా కనిపిస్తుంది. సకల ప్రాణకోటికి ఆహారాన్ని అందించే జగన్మాత అన్నపూర్ణదేవి అవతారంలో ఓ చేతిలో మధురసాలతో ఉన్న మాణిక్య పాత్ర. మరో చేతిలో రతనాల గరిట పట్టుకుని భక్తులకు దర్శనమిస్తుంది. ఈ చరాచర సృష్టికి జీవనాధారం తానేనన్నది అమ్మవారి దర్శన అంతరార్ధం. మీకు మీ మీ ఇండ్లల్లో కడుపునిండా అన్నం పెట్టే ప్రతి తల్లిలో తానుంటాని దుర్గమ్మ సూచించడంగా  అర్ధం చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ కని పెంచి.. అన్నం పెట్టి.. సాకి సంతరించిన తల్లులను, వ్రుద్ధాశ్రమాల పాలు చేయకుండా గౌరవించడని సూచించే అలంకారం అన్నపూర్ణాదేవిది.

మూడు శక్తులు ఏకమైన తల్లి. ఐశ్వర్యం ఆమే.. విద్యాశక్తి ఆమే.. మహాశక్తి ఆమే. ఈ మొత్తం సృష్టి ఆమె సృజనే. ఆమె లేని లోకం చూడనవసరం లేదు. అసలా మాటకొస్తే మహిళలేని లోకమే లేదు. అన్నీ ఆ అభయ హస్తంలో దాగి వున్నాయని సూచించడానికి నిదర్శనాలు ఆమె అవతార మహిమలు. అమ్మవారు ఇంద్రికీలాద్రిపై వెలసి భక్తుల పాలిట కొంగుబంగారమై పూజలందుకుంటోంది. దసరా శరన్నవరాత్రులు కనకదుర్గమ్మ అపార మహిమలను చూపుతుంది. అనితర సాధ్యమైన ఎన్నో విషయాలు తనలో దాగి వున్నాయని సూచిస్తుందా తల్లి.

అందుకు నిదర్శనంగా నాలుగో రోజు దుర్గమ్మను లలితా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు.
లక్ష్మీ, సరస్వతులు అమ్మవారికి ఇరువైపులా వింజామరలు వీస్తుండగా.. సదాశివుడ్ని తన ఆసనంగా మలుచుకుని.. కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుందీ అవతారంలో.లలితా త్రిపుర సుందరి అంటే ఈ మొత్తం భూమండలానికీ ఆధారభూతమని అర్ధం. మనపై లాలిత్యంతో కూడిన అధికారం ఆమె సొంతం. అంతే కాదు విద్యకు ప్రతి రూపమైన సరస్వతి, ధనానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవి.. ఆమెకు ఇరువైపులా చేరి సేవించడంలో ఓ పరమార్ధముంది. విద్య-ధనం రెండూ స్త్రీ మూర్తి సేవ చేయడానికి ఉపయోగించాలని సూచిస్తాయి. ఎన్ని విద్యలొచ్చిన వారైనా.. ఎంత ధనవంతులైనా సరే.. ఆ విద్యాధనాలను మహిళాభ్యున్నతికి వినియోగించాలని సూచించే అలంకారమిది. అలా చేసినప్పుడు మాత్రమే వారి వారి కుటుంబాలు.. బలపడుతాయని అర్ధం చేసుకోవాలని అంటారు. ఇక ప్రకృతి- పురుషుడులో పురుషుడు కూడా ఆమె ఆధీనంలోనే ఉంటాడని. అలా వుండటమే ధర్మమని సూచిస్తుందీ అవతారం. విద్యా, ధన, పురుష శక్తులు ఆమె ఆధీనంలో వుండి.. ఆమె సేవలకు వినియోగించడంలోనే కుటుంబ వ్యవస్థకు మంచిదని సూచిస్తుంది లలితా త్రిపురసుందరి అలంకారం.

ఐదవరోజు అమ్మవారికి మహాలక్ష్మీ అలంకారం చేస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మలగన్న అమ్మగా ప్రసిద్ధి పొందిన దుర్గమ్మ.. మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి రూపాలతో కూడా నిత్యం పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మి అవతారంలో ఉన్న దుర్గమ్మను కొలిస్తే ఏ రకమైన ఈతి బాధలుండవని భక్తుల విశ్వాసం. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకలసంపదలు చేకూరుతాయన్న అపార నమ్మకం. ధనానికి అధిదేవత మహిళే. ఆమె ఇస్తున్న ధనమే ఇదంతా. అందుకే 'యత్రనార్యంతు పూజ్యంతే' అన్నా భాష్యం పుట్టిందని అంటారు. ఎక్కడ మహిళ గొప్పగా గౌరవించబడుతుందో అక్కడ సమస్త సంపదలుంటాయని సూచిస్తూ అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తుంది. అసలు స్త్రీని శక్తి స్వరూపిణిగా కొలవడమే, సంపదలనిస్తుందని.. ఆమెను గౌరవించడంలోనే అష్టైశ్వర్యాలు దాగి వున్నాయని తెలుపుతూ కనకదుర్గమ్మ మహాలక్ష్మి అవతారంలో భక్తజనులకు దర్శనమిస్తుంది.

ఆరవ రోజు కనకదుర్గమ్మ జన్మనక్షత్రం సందర్భంగా  సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిస్తుంది. వీణ చేతపట్టి, పుస్తకం ధరించిన రూపంతో సరస్వతీదేవిగా కనువిందు చేస్తుందీ రోజు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిగా, త్రిశక్తి స్వరూపిణియైన దుర్గాదేవి తన అంశంలోని నిజరూపాన్ని సాక్షాత్కరింపచేయడమే ఈ అలంకారం ప్రత్యేకతగా చెబుతారు. అజ్ఞానమే అసలు సిసలైన చీకటి. ఆ చీకటిని పారదోలడానికి విద్యాజ్ఞానం ఎంతో అవసరం. ఆ విద్యలన్నీ.. మహిళామూర్తిలో దాగి వుంటాయి. పుట్టినప్పుడు పాలివ్వడం నుంచి పెరిగి పెద్దయ్యి ప్రయోజకత్వం సాధించే వరకూ తల్లి నేర్పే విద్యలు అన్నిన్ని కావు. నిజమైన విద్యాస్వరూపం నీకు జన్మనిచ్చిన తల్లే.  నీ విజయంలో ప్రధాన భాగస్వామ్యం స్త్రీశక్తిదే. ఆమె నేర్పిన విద్యలే ఇవన్నీ. అలాంటి విద్యలకు అధిదేవత ఆమె. ఆమె దర్శనమాత్రం చేత.. అజ్ఞానం తొలిగిపోతుందని సూచిస్తుంది సరస్వతిదేవిగా కనిపించే కనకదుర్గ అవతారం.
నీకు వూపిరి పోసేది స్త్రీ.. నీకు పాలిచ్చి.. గోరుముద్దలు తినిపించి.. పెంచి పెద్ద చేసేది స్త్రీ.. నీకు పాపిడి తీసి బడికి పంపేది స్త్రీ.. నిన్ను ఇంతింతై వటుడింతై చేసేది స్త్రీ.. నీ విద్యా ఉద్యోగ వ్యాపారాభివృద్ధికి సహకరించేది స్త్రీ.. నీతో ఏడడుగులు నడిచేది స్త్రీ.. నీ వంశాకురాన్ని కని.. నీ చేతుల్లో పెట్టేది స్త్రీ.. వారిని తిరిగి లాలించి పాలించి పెంచి పెద్దవారిని చేసేది కూడా స్త్రీయే.. ఆఖరున నీతో కలసి నడిచేది స్త్రీ.. నీ ప్రారంభం.. ప్రారబ్ధం రెండూ స్త్రీ చేతిలోనే ఉంటాయి.. అలాంటి స్త్రీ శక్తి కి చిహ్నమైన దసరా ఉత్సవ సమయంలో తెలుసుకోవల్సిన సారం ఇంకెంతో ఉంది..
దసరా ఆరు రోజులు ఒకెత్తు. మిగిలిన మూడు రోజులు ఒకెత్తు. కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిలో వెలసినందుకు ప్రతీకగా జరిగే వుత్సవాలు ఈరోజునే జరుగుతాయి. ఆమెలోని అనితరసాధ్యమైన శక్తియుక్తులు దర్శనమిచ్చేది ఈ మూడు అవతారాల్లోనే. దుర్గమ్మను ఎదురిస్తే ఎంతటి మహిషాసురుడికైనా మరణమేనని సూచిస్తుంది. మహిషాసురుడిని అంతమొందించే సమయంలో దుర్గాదేవి అవతారం అత్యంత ప్రధానమైంది. శరన్నవరాత్రుల్లో అష్టమి నాడు దుర్గామాత అవతారంతో మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసినందుకు గుర్తుగా దర్శనమిస్తుంది. ఆ రోజు అమ్మవారికి దుర్గాదేవి అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహిస్తారు.  దీన్నే దుర్గాష్టమి పర్వదినంగా పాటిస్తారు. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడినవారు అస్త్ర పూజ చేస్తారు. పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచిదని చెబుతారు. అలాగే ఉత్తరగోగ్రహణం యుద్ధంలో అర్జనుడు జమ్మి చెట్టు మీది ఆయుధాలను పూజించి విజయం సాధించింది ఈ పర్వదినంలోనే అన్నది ఇతిహాసం. అమ్మవారిని దుర్గాదేవిగా చూపడంలో అంతరార్ధం.. ఆమె దుష్టశక్తిని గుర్తించిందంటే ఇక ఆ దుర్మార్గుడి ఆయువు మూడినట్టేనని అర్ధం. మహిళల శక్తియుక్తులు తెలీక స్వైరవిహారం చేసే వారికి చరమగీతం తప్పదని సూచిస్తుంది దుర్గామాత అలంకారం.

దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపం మహిషాసుర మర్ధినీ దేవి. ఆశ్వయుజ  శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా మహర్నవమిని భక్తులు మహోత్సవంగా జరుపుకుంటారు. సింహ వాహనం అధీష్ఠించి.. ఆయుధాలను ధరించి.. అమ్మ సకల దేవతాంశాలతో మహాశక్తి రూపంలో దర్శనమిస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడ్ని సంహరించిన శక్తి స్వరూపాన్ని మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయాలు తొలగిపోతాయని నమ్ముతారు.. సకల విజయములు కలుగుతాయని విశ్వసిస్తారు. మహిషాసుర మర్ధినీ దేవిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితమని చెబుతారు. మహిళలను గౌరవించడం అంటే సమస్తమైన శుభాలను ఆహ్వానించడమని చెబుతుందీ అలంకారం. ఆమెను అబలగా అనుకుని పొరబడ్డావో.. మహిషాసురుడికి పట్టిన గతే పడుతుందని  సూచిస్తుంది మహిషాసుర మర్ధిని అలంకారం.

రాజరాజేశ్వరీ దేవి అలంకారం. రాజరాజేశ్వరీ దేవి కమలంపై ఆసీనురాలై ఉంటుంది. చేతిలో చెరకుగడతో.. భక్తులకు అభయమిస్తూ కనిపిస్తుంది. రాజరాజేశ్వరీదేవిని అపరాజితాదేవిగానూ పిలుస్తారు. ఆమెకే విజయ అని మరో పేరు. మణిద్వీపంలో శ్రీనగరంలోని చింతామణి ఆమె నివాసం. విజయాదేవి చెడుపై సాధించిన విజయమే విజయదశమి అయ్యిందట. ఈ అలంకారంలోని అంతరార్ధమిదే. ఏ విషయంలోనైనా విజయం సాధించాలంటే మహిళ తోడ్పాటు ఎంతో అవసరమని సూచించే అలంకారమిది. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ అండదండలు ఉంటాయన్న మాట ఊరకే పుట్టలేదు. అమ్మవారి మహిమల వల్లే ఈ మాటకు ప్రాణమొచ్చింది. నిజజీవితంలోనూ అంతే.. మహిళా శక్తి సాయం లేకుండా ఏ పురుషుడూ మనుగడ సాధించడం కష్టం. అందుకే స్త్రీశక్తికి గుర్తుగా దసరాను చేసుకోమని చెబుతాయి అమ్మవారి అలంకారాలన్నీ.

ఆమే మనకు ఆధారం. ఆమెను గౌరవించడంలోనే సమస్తమైన విజయాలు దాగి వుంటాయి. సుఖసంతోషాలు దొరుకుతాయి. ఆమె పట్ల దురాచారం.. సర్వమానవాళికి చేజేతులా కలిగించే నష్టం. కనకదుర్గను కొలవడం.. ఆమె అవతారమహిమలను తెలుసుకోవడం అంటే, మన చుట్టూ ఉండే మహిళలను తగిన రీతిన గౌరవంచడాన్ని సూచిస్తుంది.

అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి - తెలుగు శాల సౌజన్యంతో 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top