పెదకొమెర్లలో చెప్పిన కాలజ్ఞానం - Pedakomerla lo cheppina kalagnanam

- పెదకొమెర్లలో చెప్పిన కాలజ్ఞానం -
ఒక రోజు సాయంకాలం మామూలుగానే ఆయన దగ్గరకు ఊరి పెద్దలందరూ చేరారు. తమకు జ్ఞానోపదేశం ప్రారంభించమని అడిగారు. వారందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా బ్రహ్మంగారు తాను ఆ రోజునుంచీ కాలజ్ఞానం చెప్పేందుకు నిర్ణయించుకున్నానని చెప్పి తన కాలజ్ఞానాన్ని అందరికీ వినిపించటం ప్రారంభించారు.

۞ వేల సంవత్సరాలనుంచి వేద ధర్మాన్ని ఆచరిస్తున్న భారతీయులు క్రమంగా దానిని వదిలేసి, ఇతర ధర్మాన్ని, సంస్కృతులను ఆచరించటం మొదలుపెడతారు.
 • ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాము. ప్రస్తుతం సజీవంగా వున్న, ఏకైక ప్రాచీన సంస్కృతి అయిన వేద ధర్మాన్ని క్రమంగా వదిలివేస్తూ, విదేశాలనుంచి పస్తున్న సంస్కృతిని తప్పనిసరిగా చేసుకుంటున్నాము. ఆధునిక ఫ్యాషన్లను, అలవాట్లను అనుకరిస్తున్నాము.
۞ వావి వరసలు మాయమైపోయి, కేవలం ఆడ మగ అనే రెండు జాతులు మాత్రమే మిగులుతాయి. క్షణికమైన సుఖం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ వుంటారు. 
 • బ్రహ్మంగారు చెప్పినట్టే ప్రస్తుతం విషయ వాంఛలు పెరిగిపోయాయి ఏ పదవిలో వున్నా, అధికారంలో వున్నా అందరికీ కావలసింది పరస్త్రీలు. 
 • వావి వరసలు మరిచిపోవటం వల్లే వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. హత్యలకు సైతం దారి తీస్తున్నాయి.
۞ ఒకే కుటుంబంలో వున్న వారు కూడా (తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, తమ్ముడు) ఒకరినొకరు మోసగించుకునేందుకు ప్రయత్నిస్తారు. గురు శిష్యుల మధ్య వుండవలసిన గౌరవ, ప్రేమ పూర్వకమైన సంబంధం నశించిపోతుంది. ఎవరికి వారు తమ స్వార్ధం కోసమే జీవిస్తారు.

۞ కరువు పెరుగుతుంది. పంటలు పండవు. ప్రకృతి ధర్మాలు నశించిపోతాయి దీనివల్ల అంతటా అల్లకల్లోలం ఏర్పడుతుంది.

۞ 5000 ఏళ్ళ తర్వాత వచ్చే ప్రభవ పార్ధివ నామ సంవత్సరంలో ఒక పెద్ద ప్రళయం వస్తుంది. దీంతో ప్రపంచమంతా విస్ఫోటనాలు చెలరేగుతాయి. ఉప్పెనలు వస్తాయి. భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. ప్రజలందరూ మారణ జ్వాలలో చిక్కి నశించిపోతారు.

۞ మనోశక్తి వల్ల జరగబోయే విషయాలన్నీ తెలుస్తాయి. కొందరు దొంగ యోగులు ప్రజలను మభ్యపెట్టేందుకు చిన్న చిన్న మాయలు చేస్తారు. ప్రజలు వీరి వలలో చిక్కుకుంటారు.

۞ సూర్యుని శక్తి మనుషులకు కనబడుతుంది. సూర్యుడు పచ్చని రంగులో, మనిషి రూపంలో కనబడతాడు.

۞ శ్రావణ నామ సంవత్సరంలో నదులు, వాగులు, వంకలు పొంగి పట్నాలు పల్లెలు నాశనమవుతాయి. భూమినుంచి ఓంకారం పలుకుతుంది.

۞ పలనాటి నేలమీద బ్రాహ్మణుని ఇంటిలో కాకర చెట్టుకి చింతకాయలు కాస్తాయి అది చూసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు. నేను రాసి, పాతిపెట్టిన కాలజ్ఞానము వున్న చోట చింత చెట్టుకు జాజిపూలు పూస్తాయి.

۞ విజయవాడలో కనకదుర్గ వున్న ఇంద్ర కీలాద్రి పర్వతం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. ఇంద్ర కీలాద్రి పర్వతం బీటలు వారుతుంది. కనకదుర్గమ్మ వుండేందుకు చోటు లేక అక్కడినుంచి తరలిపోతుంది.

۞ కుంభకోణంలో పుస్న దేవాలయము కూలి కుంభుని విగ్రహం ముక్కలు ముక్కలయిపోతుంది.
 • కుంభ కోణం తమిళనాడు రాష్ట్రంలో వుందనే విషయం తెలిసిందే. మొదటినుంచీ కూడా ఈ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు, ఇతర రకాలైన ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ విషయం వార్తా పత్రికలు చదివే వారికి బాగా అర్ధమవుతుంది.
 • కాబట్టి, ఇక్కడ వుండే దేవాలయం కూలిపోవటం అనేది కూడా భవిష్యత్ లో జరగవచ్చేమో!
۞ అయిదేళ్ళున్న చిన్న పిల్లవాడు జ్యోతిష్యము చెబుతాడు.

۞ రక్తాక్షి నామ సంవత్సరంలో చెన్నపట్టణంలో ఒక బ్రాహ్మణ గృహంలో ఎనిమిది సంవత్సరాలున్న ఒకటాలికకు ఒక శిశువుకు జన్మనిస్తుంది. ఆ శిశువు మానవ రూపంలోనే వున్నా అనేక వికృతులను కలిగివుంటాడు. ఆ బాలుడు 22 రోజులు జీవించి 23 వ రోజున త్వరలో వీరభోగ వసంతరాయలు ఈ భువిపైకి వస్తాడని చెప్పి మరణిస్తాడు.
 • జన్యుపరమైన లోపాల వల్ల పిల్లలు రకరకాల వికృతులతో పుట్టటం ఇప్పుడు మనం చూస్తూనే వున్నాం. ఈ రకమైన శిశువు గురించే బ్రహ్మంగారు చెప్పి వుంటారు అయితే దీనికి అణు, ఇతర రకాలైన పదార్ధాలు కూడా కారణమే! మధ్యప్రదేశ్లోని భోపాల్లో మిథేన్ గాస్ లీక్ కావటం వల్ల, అనేకమంది ప్రజలు మరణించగా బతికున్నవారు. 
 • భయంకర వ్యాదులవల్ల క్రమంగా మరణిస్తున్నారు. 
 • ఈ గాస్ వల్ల ఆ సమయంలో గర్భవతులుగా వున్న స్త్రీలకు పుట్టిన పిల్లలు రకరకాల వికృతులతో పుట్టారు.
۞ కర్నూలు పట్టణంలో ఉత్తర దిక్కున వున్న శివాలయంలో వేపచెట్టు పుడుతుంది అది పుట్టటం తోటే ఎన్నో వింత వింత సంఘటనలు జరుగుతాయి. ప్రజలు దీనిని ఒక మహిమ గల చెట్టు అని భావించి, మొత్తం 30 రోజులపాటు ఉత్సవములు జరుపుతారు.
ముప్రైమూడో రోజున అనేక ఉత్పాతములు జరిగి ఆ ప్రదేశం చుట్టుపక్కల వుండే ప్రజలందరూ మరణిస్తారు.

۞ బంగాళదేశము (బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్) నందు ప్రజలు జలోత్పాతాల వల్ల అధికంగా నశిస్తారు.
 • సముద్ర తీరంలోని బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాలు రెండిటికీ తుఫాన్ల తాకిడి బాగా ఎక్కువగా వుంటుందనేది అందరికీ తెలిసిందే.
۞ ధూర్జటి వ్యయనామ సంవత్సరములో దక్షిణాయనమునందు ఒక వినాశకరమైన నక్షత్రము పుడుతుంది. అది రాబోయే ఉత్పాతాలకు ఒక సూచన అని తెలుసుకోవాలి.
అది పుట్టిన తర్వాత 45 వ రోజున ప్రజల శరీరమున అనేక బొబ్బలు ఏర్పడతాయి వారు మంటలలో చిక్కుకున్నట్టు బాధలను అనుభవిస్తారు. తర్వాత మరణిస్తారు.

 ۞ పుణ్యభూమి అయిన భారత దేశంలోనూ, ప్రపంచంలోనూ పాపాలు పెరుగుతాయి. పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది. మనుషులలో క్రూరత్వం, అబద్ధమాడటం, ఇతరులను మోసం చేయటం, నమ్మినవాళ్ళకు చెడుచేయటం వంటి లక్షణాలు బాగా పెరుగుతాయి.

۞ మనుషులలో కామేచ్చ పెరుగుతుంది. వావి వరసలు లెక్క చేయరు.
 • బ్రహ్మంగారు చెప్పిన ఈ విషయాన్ని మాత్రం అందర ఒప్పుకోక తప్పదు. 
 • అన్ని విధాలుగా ముఖ్యంగా సినిమాలు, వ్యాపార ప్రకటనలు వంటి వాటిలో స్త్రీ పురుషులు అర్ధ నగ్న వస్త్రధారణ వేపు మరలుతున్నారు. 
 • అలాగే వివిధ ప్రసార సాధనాలు కూడా అంగ ప్రదర్శనను ప్రధానంగా చేసుకునే కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి.
۞ ఒక కులం వారు మరొక కులం వారిని వివాహమాడటం ఎక్కువవుతుంది.

۞ దేవతా స్థలములు - (అంటే దేవాలయములు అని అనుకోవచ్చు), ఆశ్రమ భూములలో అసుర కార్యక్రమాలు జరుగుతాయి.
 • అంటే వ్యభిచారం, జూదం, భక్తులను మోసం చేయటం వంటివి అని మనం
 • అర్ధం చేసుకోవచ్చు. 
 • ఈ మధ్య రోజుకొక దొంగ బాబా గురించి పేపర్లలో చదువుతున్నాము. 
 • ఈ బాబాలు ఆశ్రమాలను మొదలుపెట్టి, తమ భక్తురాళ్ళను ప్రలోభ పెట్టి రక రకాల అకృత్యాలకు పాల్పడటం మనకు తెలుసు. 
 • కొందరు దొంగ బాబాలు తమకేమో శక్తులున్నాయని చెప్పుకుంటూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.
۞ వేదాలను అధ్యయనం చేయటం, వాటిని గురించి వివరించటం తగ్గిపోతుంది, క్షత్రియ కులము నాశనమవుతుంది. శూద్రులు రాజరికం చేపడతారు.
 • ఇది అక్షరాలా జరుగుతోంది. హిందూ సంస్కృతికి జన్మనిచ్చిన వేదాలన గురించి ఇప్పటి హిందువులలో 90 శాతం పైగా తెలియదు. 
 • నేడు దేశాన్ని-రాష్ట్రాన్నిశూద్రులే అధికంగా పాలిస్తున్నారు.
۞ తల్లి తండ్రులు పిల్లలను విక్రయించుతారు.
 • తీవ్రమైన కరువు వల్ల పిల్లలను తల్లి తండ్రులు విక్రయించటం చాలా సామాన్యమైపోయింది. ప్రతిరోజూ ఇలాంటి వార్తలను మనం పేపర్లలో చదువుతూనే వున్నాం. 
 • మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలలో ఈ విషాదకర పరిస్థితి వుంది.
 • ఇక్కడ తాము బతకటానికో, లేకపోతే పిల్లలను బతికించటానికో ఇలా అమ్మటం ఈ జిల్లాల్లో సాధారణం అయిపోయింది.
۞ సువర్ణ ముఖినుంచి 11 మంది భక్తులు పుట్టబోతారు.

۞ లెక్కకు మిక్కిలి ప్రజలు మరణించి, తత్ఫలితంగా భూ భారం తగ్గిపోతుంది. ఇంటికి యజమానులు మరణిస్తారు. దీనివల్ల స్త్రీ,బాల వృద్దులు కష్టాల పాలవుతారు.

సంకలనం: కే. వీర బ్రహ్మాచారి  

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top